తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. నిన్న మహారాష్ట్ర తుల్జాపూర్‌లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో భవానీ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆశ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ తరుణంలోనే..మహారాష్ట్రలో తెలంగాణ సీఎం కేసీఆర్ మటన్ తిని అక్కడ దేవుళ్లను దర్శించుకున్నారు అంటూ మహారాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. పండరీపూర్ లో రాయల్ మటన్, చికెన్ తిన్నాక పాండురంగ స్వామిని దర్శించుకున్నారని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే, ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిట్కారి ఆరోపించారు. మహారాష్ట్ర మటన్ అంతగా నచ్చితే తెలంగాణకు తీసుకెళ్లి తినాలని, లక్షలాది మంది సెంటిమెంట్లతో ఆడుకోవద్దని హెచ్చరించారు.