వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. వంట నూనెల ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. వేరుసెనగ నూనె ధర నెల వ్యవధిలోనే లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు ఎగసింది. పామాయిల్ ధర లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు పెరిగింది. దేశీయంగా నూనెగింజల పంటల ఉత్పత్తి తగ్గుతుందని ఇటీవల విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడి కావడంతో పాటు, వేరుసెనగ నూనెకు విదేశాల్లో డిమాండు ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధం, ఇండోనేసియాలో ఆంక్షల ప్రభావం వల్ల నూనెల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. వేరుసెనగకు చైనా నుంచి డిమాండు ఎక్కువై.. ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత నుంచి చైనా మన దేశం నుంచి వేరుసెనగ దిగుమతుల్ని పెంచింది.
మరోవైపు సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.135 దగ్గరలో ఉంది. పామాయిల్ ధరల పెరుగుదలకు దిగుమతులు తగ్గిపోవడం, ఎగుమతులపై ఇండోనేసియా ఆంక్షలు విధించడం కారణంగా చెబుతున్నారు. పెరిగిన నూనెల ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.