కరోనా కొత్తవేరియంట్లు మళ్లీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే చైనా, అమెరికా వంటి దేశాల్లో కొత్త వేరియంట్లు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈ వేరియంట్ కేసులు ఇండియాలో కూడా నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ కేసులు ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఈ తరహా కేసుల సంఖ్య ఏడుకు చేరింది.
ఇంతకు ముందు ఎక్స్‌బీబీ.1.5 కేసులు గుజరాత్లో మూడు, కర్ణాటక (1), రాజస్థాన్ (1) చొప్పున నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం ఇన్సాకాగ్ వెల్లడించింది. ఎక్స్‌బీబీ.1.5.. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ రకానికి చెందినది. అమెరికాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం. అలాగే మనదేశంలో బీఎఫ్.7 వేరియంట్ కేసులూ ఏడు నమోదైనట్లు ఇన్సాకాగ్ నివేదిక పేర్కొంది. ఈ రకం వేరియంట్ కారణంగానే చైనాలో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అంచనా.