ఆ ఆలోచనను విరమించుకోండి.. సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం కార్యదర్శి లేఖ

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. సెంట్రల్ వర్సిటీ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నంబర్ 25 కింద 2,300 ఎకరాల స్థలాన్ని పరిశోధన.. విద్యారంగ అభివృద్ధికి కేటాయించిందని, అయితే ప్రస్తుతం ఈ భూమిని వేలం వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని జాన్వెస్లీ వివరించారు.

గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఈ 400 ఎకరాలను స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణానికి మార్కెట్ విలువ కంటే చాలా తక్కువకే కేటాయించారని అయితే తగిన అభివృద్ధి చేయడంలో ఆ కంపెనీ విఫలమవ్వడంతో ఆ భూములను ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల ద్వారా తిరిగి పొందిందని తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిని రూ.18 వేల కోట్ల (అంచనా విలువ)కు 2025 మార్చి 8 నుండి 15 తేదీల మధ్యన వేలం వేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. వర్సిటీలోని పర్యావరణ, అకడమిక్, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిన ఇటువంటి స్థలాన్ని ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల స్వార్థ ప్రయోజనాలకు ప్రభుత్వం ధారాదత్తం చేయడమే అవుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news