తెలంగాణ మరోసారి కోటి ఎకరాల మాగాణిగా మారింది. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో పంటల సాగు మరోసారి కోటి ఎకరాలు దాటింది. ప్రస్తుత సీజన్‌లో 1,24,28,723 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను బుధవారం వరకు 1,01,72,383 ఎకరాల్లో పంటలు వేశారని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. గత ఏడాది ఇదే సమయానికి 94,93,027 ఎకరాల్లో సాగు కాగా.. ఈ ఏడాది అంతకంటే అదనంగా దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలైనట్లు పేర్కొంది.
అత్యధికంగా 41,73,997 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. జిల్లాలవారీగా చూస్తే మెదక్ (221.29 శాతం), ఆదిలాబాద్ (104.17 శాతం), కుమురంభీం ఆసిఫాబాద్ (104.53 శాతం), నిజామాబాద్ (103.68 శాతం) జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా పంటలు సాగవుతున్నాయి. ములుగు (36.86 శాతం), వనపర్తి (25.96 శాతం) జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువ పంటలు వేశారు. వచ్చే నెల మొదటి వారం వరకు వరినాట్లు కొనసాగనున్నందువల్ల సాధారణ సాగు లక్ష్యాన్ని చేరుకునే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.