మిగ్‌జాం తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీలతో పాటు తెలంగాణపైనా పడుతోంది. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిగ్‌జాం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉండనుందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. 5వ తేదీ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ(రెడ్‌అలర్ట్) కురుస్తాయని చెప్పారు. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
మరోవైపు సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలలో అతి భారీ(ఆరెంజ్ అలర్ట్).. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు(ఎల్లో అలర్ట్) కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. 6వ తేదీ కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, భువనగిరి, భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌లలో భారీ వర్షాలు(ఎల్లో అలర్ట్) .. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు ఉండొచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.