దళితబంధు దరఖాస్తుల పరిశీలన నిలిపివేత

-

తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరిన తర్వాత దళితబంధుకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఈ పథకం రెండో విడతలో తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిలిపివేసినట్లు ఎస్సీ సంక్షేమశాఖ తెలిపింది. దాదాపు 50 వేల దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సహాయాన్ని అందించాలా? లేదా? నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ రాసింది.

ఈ పథకం రెండోవిడత కార్యక్రమంలో పైలట్‌ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారని సంక్షేమ శాఖ తెలిపింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్థాల రవాణా వాహనాలు ఇచ్చి, వాటిని జలమండలితో అనుసంధానం చేశారని పేర్కొంది. ఇతర జిల్లాల్లో మరో 238 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసి, తొలివిడత నిధులిచ్చారని.. ఈ లబ్ధిదారులకు మిగతా నిధుల విడుదలపై సందిగ్ధత నెలకొందని చెప్పింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్సీ సంక్షేమశాఖ లేఖలో స్పష్టం చేసింది. ఈ శాఖ లేఖపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని లబ్ధిదారుల్లో ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version