ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి

-

తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి ఊహించని ఆదరణ లభిస్తోంది. ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సులు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాలుగైదు నెలల్లో దాదాపు 2,050 కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. అందులో 1,050 డీజిల్‌, 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉంటాయని వెల్లడించారు.

అయితే ఉచిత ప్రయాణానికి అర్హులైన వారు తప్పనిసరిగా ఫొటో స్పష్టంగా కనిపించే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని ఎండీ సజ్జనార్ సూచించారు. స్మార్ట్‌ఫోన్లలో గుర్తింపు కార్డుల సాఫ్ట్‌ కాపీలు చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. బస్సుల్లో ఫుట్‌ బోర్డు ప్రయాణంతో పాటు వెనుక లాడర్‌ పైకెక్కి ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించడం సరికాదని చెప్పారు.

ఈ పథకం ఈనెల 9వ తేదీ నుంచి అమల్లోకి రాగా 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని సజ్జనార్ వెల్లడించారు. రోజుకు సగటున 51 లక్షల మంది ప్రయాణిస్తుండగా ఇందులో 30 లక్షల మంది మహిళలే ఉంటున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version