రేపు విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు దిల్లీ పోలీసుల నోటీసులు

-

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్‌ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు దిల్లీ ద్వారకా సెక్టార్‌లోని పోలీస్‌ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హాజరు కాకపోతే సీఆర్‌పీసీ 91/160 కింద క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ మన్నె సతీశ్‌, కోఆర్డినేటర్‌ నవీన్‌, పీసీసీ కార్యదర్శి శివకుమార్‌, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. అమిత్‌షాపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన వీడియోను, పోస్ట్‌ చేసేందుకు వినియోగించిన ల్యాప్‌టాప్‌/మొబైల్‌/ట్యాబ్లెట్‌ను, ఈ వీడియోను ఎక్కడి నుంచి తీసుకున్నారో దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని సూచించారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version