తెలంగాణ తల్లి అంటే ఒక భావన కాదని.. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం శాసనమండలిలో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన పై ప్రకటన పై విడుదల చేశారు. ఆ ప్రకటనలో తెలంగాణ తల్లి విగ్రహం స్వేచ్ఛ కోసం పిడికిళ్లు బిగించి సకలజనులు ఒక్కటే అని గర్జించిన ఉద్వేగం కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు అద్దం పట్టేలా రూపొందించామని తెలిపారు.
తెలంగాణ చిరునామాని ఉద్యమాలను, పోరాటాలను, అమర వీరుల ఆత్మబలి దానాలను దీనికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను రూపొందించామని ప్రకటించారు. పోరాట యోదులు చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఎంతో హుందాగా మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. ఈ విగ్రహం తెలంగాన జాతి భావనకు జీవం పోసిందని.. మన సంస్కృతి సాంప్రదాయాలకు, నిలువుటద్దంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రను పరిగణలోకి తీసుకొని నిండైన రూపాన్ని ఇచ్చామని వివరించారు భట్టి విక్రమార్క.