తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. జులై నెల వరకు అవసరాల కోసం 78,911 కోట్ల రూపాయల వినియోగం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రతిపాదించారు. దానిపై నేడు శాసనసభ, శాసన మండలిలో చర్చ జరగనుంది. చర్చతో పాటు ప్రభుత్వ సమాధానం కూడా ఇవాళ్టి ఎజెండాలో పొందుపరిచారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ వ్యయంపై చర్చ జరగనుంది. అవసరమైతే నీటిపారుదల, కృష్ణా జలాల అంశంపై కూడా శాసనసభలో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈనెల 8వ తేదీన శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున గవర్నర్ ప్రసంగించారు. మరుసటి రోజు 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇక 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టగా 11వ తేదీ ఆదివారం కావడంతో అసెంబ్లీ సమావేశాలకు విరామం ఇచ్చారు. తిరిగి 12వ తేదీన ప్రారంభమైన సమావేశాల్లో కృష్ణా జలాల వివాదం, ప్రాజెక్టుల అప్పగింత గురించి చర్చ జరిగింది. 13వ తేదీన ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్, మంత్రులు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లగా సభ వాయిదా పడి తిరిగి ఇవాళ సమావేశం కానుంది.