తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. జూన్ 2వ తేదీన ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాసం పథక లబ్ధిదారులకు పత్రాలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మూడు నుంచి వారం రోజుల పాటు వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తామని వెల్లడించారు. మరోవైపు ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. అయితే అప్లై చేసుకునే సమయంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే ఈ పథకం గడువు పెంచాలని అర్హులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం చిరు వ్యాపారులకు, EBC (ఎకనామికలీ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) వారికి 100 శాతం రాయితీతో రూ.50,000 వరకు రుణం అందించనుంది. లక్ష రూపాయల లోపు రుణం తీసుకుంటే 90 శాతం రాయితీ .. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య రుణం తీసుకుంటే, 80% రాయితీ ఇస్తారు. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ https://tgobmmsnew.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.