ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్ సభకు రావడం పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్ల అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నియమాలకు ఇది విరుద్ధం అని తెలిపారు. అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు. నిబంధనలు, విధానాలతో సభలు నిర్వహిస్తారు. సభ్యులు హుందాగా వ్యవహరించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ప్రతిపక్ష పార్టీలోని కొంతమంది ఎంపీలు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇది సరైనది కాదని.. ఎంత పెద్ద నాయకుడు అయినా సభ గౌరవాన్ని తగ్గించే ఇలాంటి దుస్తులు ధరించడం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఈ సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ.. సభ్యులు బయటకి వెల్లి దుస్తులు మార్చుకొని రావాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన పై కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే ల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే డీఎంకే సభ్యులు ఇవాళ నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి పార్లమెంట్ కి వచ్చారు. పునర్విభజన న్యాయబద్దంగా జరగాలని.. తమిళనాడు పోరాడుతుంది. తమిళనాడు గెలుస్తుందని అనే నినాదాలు టీషర్టుల పై రాసి ఉన్నాయి. దీనిపై పార్లమెంట్ వెలుపల నిరసనలు తెలిపారు.