బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ సభ్యత మరిచిపోయి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం కోసం పదవులు త్యాగం చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని.. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని సెటైర్లు వేశారు. వరి నాట్లు వేసే పంట పొలాలు పబ్బుల్లా కనిపిస్తున్నాయా..? అని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భట్టి విక్రమార్క. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు.