వచ్చే ఏడాది అక్టోబర్ నెల వరకు 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 2024 జనవరి ఒకటి అర్హతా తేదీతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం పోలింగ్ స్టేషన్ల సర్దుబాటు, ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల్లో ఉన్న తప్పిదాల సవరణ, పోలింగ్ కేంద్రాల సరిహద్దుల మార్పులు, తదితర ప్రీ రివిజన్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెల ఆరో తేదీన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించాలని ఈసీ ఆదేశించింది.
ముసాయిదాపై జనవరి 24వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించి వాటన్నింటిని ఫిబ్రవరి రెండో తేదీ వరకు పరిష్కరిస్తారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ఆ జాబితానే వినియోగిస్తారు. జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సందర్భంలో వచ్చే ఏడాది సవరణ గడువులైన ఏప్రిల్, జులై, అక్టోబర్ నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ముందస్తుగానే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆయా గడువు సమీపించినపుడు సంబంధిత దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తారని ఈసీ స్పష్టం చేసింది.