ఎన్నికలతో సంబంధంలేని నగదును వెంటనే తిరిగిచ్చేయండి : సీఈసీ ఆదేశాలు

-

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తనిఖీల్లో సరైన పత్రాలు చూపించినా.. చిన్న చిన్న కారణాలు చెప్పి సొత్తును పోలీసులు సీజ్ చేస్తున్నారని సామాన్యులు వాపోతున్నారు. మరోవైపు సొత్తు నిబంధనల ప్రకారం ఉంటే తిరిగి తీసుకెళ్లవచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా పోలీసులు తమ సొత్తు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని సామాన్యులు ఈసీకి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న నగదులో ఎన్నికలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేదనుకుంటే సదరు యజమానులకు వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సొమ్ము తిరిగివ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్షన్ కమిషన్ సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ నీతీష్‌ కుమార్‌ వ్యాస్‌ చెప్పారు. త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్న దృష్ట్యా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఎక్కడా రాజీపడవద్దని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version