జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం అర్ధరాత్రి నుంచి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో మంగళవారం నాటికి కూడా కొనసాగిన ఆపరేషన్లో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరగ్గా భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. అధికారులు వారు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం నాడు కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకోని దాడులు చేయడంతో IAF అధికారి విక్కీ పహాడే మరణించగా, నలుగురు గాయపడ్డారు. అయితే ఈ దాడి వెనుక ఉన్నది, ఉగ్రవాదులా కాదా అనేది ఇంకా తెలియరాలేదు. ఏప్రిల్ 29న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆనంద్ జైన్ మాట్లాడుతూ, ఇటీవల రెండు గ్రూపుల ఉగ్రవాదులు సరిహద్దు దాటి లోపలికి చొరబడిన రెడ్వానీ ప్రాంతంలో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని కనిపెట్టడానికి భద్రతా సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.