అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం కింద కేసు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

 అక్రమంగా మద్యం సరఫరా చేసే వారికి రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తే పీడీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా హానికారక రసాయనాలతో నాసిరకమైన మద్యం తయారు చేసి ఇతర రాష్ట్రాల మీదుగా తెలంగాణకు తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి మద్యం తీసుకొచ్చినా.. ఆర్మీ క్యాంటీన్లలో రాయితీపై తీసుకొచ్చే మద్యం బాటిళ్లను బయట విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం తీసుకురాకుండా పోలీస్, రవాణా శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జార్ఖండ్‌కు చెందిన రాజారాం సింగ్.. హరియాణా నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించినందుకు నిందితుడిపై పీడీ చట్టం కింద తొలి కేసు నమోదు చేశామని చెప్పారు. రాజారాం సింగ్ నగరంలోని ముషీరాబాద్‌లో అక్రమ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారని.. గతంలో ఈ తరహా కేసులు అతనిపై నమోదయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో పీడీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version