భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్ల కోసం భారీ ఎత్తున అభిమానులు మరోసారి సికింద్రాబాద్ జింఖానా స్టేడియం వద్దకు చేరుకున్నారు. గురువారం రోజున టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి భౌతికంగా టికెట్లు ఇస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది.
హెచ్సీఏ ప్రకటన నేపథ్యంలో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసకున్న క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో మరోసారి జింఖానా స్టేడియానికి చేరుకుంటున్నారు. స్టేడియానికి చేరుకుంటున్న అభిమానులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించేస్తున్నారు. జింఖానా మైదానం ప్రవేశ ద్వారాన్ని మూసివేసిన పోలీసులు.. టికెట్లు అమ్మడం లేదని.. దయచేసి సహకరించాలని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
మరోవైపు జింఖానా మైదానంలో నిన్నటి ఉద్రిక్తత పరిస్థితులు, పలువురు స్పృత తప్పి ఆస్పత్రి పాలవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమన్వయ లోపం వల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అబాసుపాలైంది. మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అజరుద్దీన్తో పాటు హెచ్సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.