తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఆరు గ్యారంటీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. తొలి సంతకం కూడా ఈ హామీల దస్త్రంపైనే చేశారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. అందులో భాగంగా తొలి గ్యారెంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారెంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే..
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రేపు ప్రారంభిస్తారు. మహిళలు ఈ నెల 9 నుంచి తమ గుర్తింపు కార్డు (ఆధార్ లేదా ఇతర) చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమమని.. మిగతా గ్యారెంటీల అమలుకు సంబంధించి విభాగాల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.