గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు గాంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని, ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు విధిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, జవాబుదారీతనం కోసమే అనుమతి చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకుల బాధ్యతలపై ముఖ్యమంత్రిగారు సమావేశంలో పలు సూచనలు చేశారు. ఉత్సవాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రభుత్వ శాఖలు, నిర్వహకుల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాలని చెప్పారు.