తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్ గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తోంది. కొన్ని రోజులుగా అధికారులు ఈ పథకానికి సంబంధించిన అర్హులను గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారు. అయితే తొలి దశలో ‘గృహజ్యోతి’ కింద రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు సమాచారం. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇటీవల ‘ప్రజాపాలన’లో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులివ్వగా.. వాటిలో 30 శాతం మంది రేషన్‌కార్డు, ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లను సరిగా నమోదు చేయలేదు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేయగా అసలు దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం.