హైదరాబాద్ లో మత ఘర్షణలు తారా స్థాయికి చేరిన సందర్భంలో ముస్లిం సమాజంలో స్పృహ తీసుకొచ్చిన నేత గద్దర్ అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో జరిగిన ప్రజాయుద్దనౌక గద్దర్, సియాసత్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఆయన బ్రతిమిలాడారు.
ఇదే సమయంలో మరోవైపు జహర్ అలీ ఖాన్ మత ఘర్షణలకు వ్యతిరేకంగా కార్యచరణలో ముందుండి పని చేశారని, ఇద్దరి బంధం అప్పటి నుంచి విడదీయరానిదిగా మారిందని పేర్కొన్నారు. గద్దర్ పాటలు, నాటకాలు, ప్రదర్శనలు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి లాంటివని చెప్పుకొచ్చారు. జహీర్ అలీ ఖాన్ సేవా గుణం అపారమైంది. సియాసత్ పత్రికను నడుపుతూనే పేదలకు ఎప్పుడూ సాయం చేసేవారని గుర్తు చేశారు. గద్దర్, జహీర్ అలీ ఖాన్ నమ్మిన విలువ కోసం చివరి వరకు నిలబడ్డారని.. వారి స్ఫూర్తితో మనం సమాజ సేవలో అంకిత భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.