గ్రేటర్ హైదరాబాద్లో ఈనెల 28వ తేదీన రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం నమోదైంది. ఎండల కారణంగా ప్రజలు ఉదయం 10 దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు ఉదయం 11 గంటలకే ఉక్కపోతకు ఇంట్లో కూలర్లు, ఏసీలు ఆన్ చేయడం రోజంతా అవి తిరుగుతూనే ఉండటంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్ గతేడాది మే నెలలో వినియోగం రికార్డులను ఈ ఏడాది మార్చిలోనే బద్దలు కొట్టింది.
2023లో మే 19న 79.33 మిలియన్ యూనిట్ల వినియోగం ఇప్పటివరకు రికార్డుగా ఉండగా.. ఈ నెల 28న 79.48 మిలియన్ యూనిట్ల వినియోగంతో పాత రికార్డులు బద్ధలయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 67.97 మిలియన్ యూనిట్లే ఉంది. ఈ ఏడాది మార్చి నెల ఆరంభం నుంచి గ్రేటర్‌లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉండటంతో విద్యుత్తు వినియోగం అంచనాకు మించి నమోదవుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు.