తెలంగాణలో ఈ ఏడాది వర్షపాతం చాలా స్వల్పంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు వచ్చి నెల గడిచినా ఇప్పటి వరకు పెద్దగా వర్షాలు కురవలేదు. జూన్, జులై మాసాల్లో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదైంది. అయితే రాష్ట్రంలో అంతగా వర్షాలు లేకపోయినా.. ఎగువన భారీ వానలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుంచి తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతులకు సాగునీటికి ఇబ్బంది తొలగిపోయినట్టవుతుంది.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వద్ద నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద తాకిడితో నీటి మట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. గురువారం రోజు ఉదయం 13 అడుగులు ఉన్న నీటి మట్టం సాయంత్రానికి 15 అడుగులకు చేరింది. ఇక ఇవాళ ఉదయం 6 గంటలకు 18.5 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల నీటిమట్టం ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఇంకా పెరుగుతుందని కేంద్ర జలసంఘం అధికారులు తెలుపుతున్నారు.