గతవారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలు కాస్త తెరిపించాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. మంగళవారం ఉదయం 51.6 అడుగుల వద్ద వరకు చేరిన గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ ఉదయానికి 47.3 అడుగులకు నీటిమట్టం చేరింది. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు అడుగుల నీటిమట్టం తగ్గినట్లు అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.
ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోనే ఉంది. నీటిమట్టం నిలిచి ఉండటం వల్ల భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల ప్రాంతం వరద నీటిలో మునిగి ఉంది. అయితే నీటిమట్టం తగ్గడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న చేరిన వరద నీరు తగ్గి.. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా నీటిమట్టం తగ్గితే భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులు కూడా వరద నీటి నుంచి తేరుకుని రాకపోకలు సాగనున్నట్లు అధికారులు తెలిపారు.