ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు త్వరలోనే లైన్ క్లియర్ కానుంది. ఇన్ని రోజుల పాటు ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ఆటంకంగా టెట్ అర్హత ఉండగా.. హైకోర్టు టెట్ లేకుండానే ప్రమోషన్లు ఇవ్వాలని తీర్పునివ్వడంతో విద్యాశాఖ అలర్ట్ అయ్యింది. పదోన్నతులు ఇవ్వడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవలే పార్లమెంట్ పోలింగ్ జరిగింది. కాగా జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రమోషన్ల ప్రక్రియకు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కోడ్ ముగిసిన వెంటనే ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు విశ్వసనీయం సమాచారం.
పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ టెట్ అర్హత ఉండాలని ఆదేశాలు రావడంతో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ సమస్య ప్రధానంగా 2010 ఆగస్టు 23కు ముందు నియామకమైన టీచర్లకు ఇబ్బందిగా మారింది. దీంతో పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. కాగా న్యాయస్థానం టెట్ తో సంబంధం లేకుండా ప్రమోషన్లు కల్పించాలని తేల్చడంతో విద్యాశాఖ తదుపరి ఏం చేయాలనే అంశంపై ఫోకస్ పెట్టనుంది.