తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్వో వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. అయితే రెవెన్యూ డిపార్టుమెంట్ లో అవినీతి ఎక్కువగా వీఆర్వో వ్యవస్థ ద్వారానే జరుగుతోందని భావించిన అప్పటి సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వీఆర్వోలుగా పని చేసిన పలువురుని వివిధ డిపార్టుమెంట్ లో సర్దు బాటు చేశారు. అప్పట్లో దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
తెలంగాణ లో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించింది. తాజాగా వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి లోపు వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. గతంలో TSPSC ద్వారా ఎంపికై వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు అప్పగించి.. మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్ మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల మంది వీఆర్వోలు ఉండగా.. దాదాపు 8వేల మందిని రాత పరీక్ష ద్వాారా నియమిస్తారని సమాచారం. రాష్ట్రం మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమించనున్నారని సమాచారం.