అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు చేరాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం మంత్రి ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ లో పర్యటించి రూ.8కోట్ల45 లక్షలతో అల్లీపురం నుంచి రామకృష్ణాపురం వరకు, అల్లీ పురం ఎన్టీఆర్ విగ్రహం నుంచి జంగాల కాలనీ వరకు, అల్లీపురం ఎన్టీఆర్ విగ్రహం నుంచి ధంసలాపురం వరకు చేపట్టిన 3 రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఆయిల్ ఫామ్ పంటల ఇక్కడ కొంత మంది రైతులు బాగా వేశారని.. మిగిలిన రైతులు కూడా ఆయిల్ పామ్ కు మారాలని తెలిపారు.
ఎకరానికి రూ.52వేల సబ్సీడీ ప్రభుత్వం అందిస్తుందని.. మిర్చి, పత్తి, వరి పంటల కంటే అధికంగా లాభం వస్తుందని.. మూడు సంవత్సరాల వరకు కూరగాయలు ఇతర అంతర పంటల వల్ల ఆదాయం వస్తుందని తెలిపారు. భూములు ప్రస్తుతం బంగారంతో సమానమని.. మన దగ్గర వాతావరణం, ఎరువుల బట్టి తెగుల్లు వస్తున్నాయని రైతులు గమనించాలన్నారు. ఆయిల్ ఫామ్ పంటలతో కోతుల బాధ, తుఫాన్ ఇబ్బంది ఉండదన్నారు.