తెలంగాణ ఆర్టీసీ బిల్లు రాష్ట్రంలో కాక రేపుతోంది. ఈ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం రెండు గంటల పాటు బస్సు సర్వీసులు నిలిపివేశారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాజ్ భవన్ వద్ద నిరసనకు దిగింది. నెక్లెస్‌రోడ్డు నుంచి రాజ్‌భవన్ వరకు ఆర్టీసీ కార్మికుల ర్యాలీగా తరలివెళ్లారు. రాజ్‌భవన్ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాజ్‌భవన్ వద్ద నిరసనకు పిలుపు దృష్ట్యా బస్సులు పరిమితంగా తిరుగుతున్నాయి.
ఆర్టీసీ బిల్లును తక్షణమే గవర్నర్ ఆమోదించాలని ఆర్టీసీ ఐకాస డిమాండ్ చేసింది. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపడం భావ్యం కాదని.. బిల్లును మంత్రివర్గం ఆమోదించిందని తెలిపింది. బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. ఆర్టీసీ యూనియన్ నాయకులను రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ నాయకులతో మాట్లాడతానని చెప్పారు. ఉదయం 11.30 గంటలకు యూనియన్ నాయకులతో చర్చిస్తానని గవర్నర్ తెలిపారు.