ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమేనని విహార యాత్రలు వెళ్లేందుకు కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని తెలిపారు. 90 నుంచి 95 శాతం ఓటింగ్ జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని వసతులు కల్పించాలని ఎన్నికల సంఘానికి సూచించారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో సీఈవో వికాస్ రాజ్తో కలిసి పాల్గొన్నారు.
“ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఓటు వేయడం మనందరి హక్కు, బాధ్యత. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అండగా ఉండడం నా బాధ్యత. గత ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్‌లో ఉంటారు. అలాగే ఓటు కోసం కూడా లైన్‌లో ఉండాలి. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలి.” అని గవర్నర్ తమిళిసై ఓటర్లకు సూచించారు.