ఎమ్మెల్సీల నియామకం కోసం రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై… విచారణను వచ్చేనెల 8కి హైకోర్టు వాయిదా వేసింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణను భారాస సర్కార్ నామినేట్ చేయాలని సిపారసు చేసింది. మంత్రివర్గ సిపారసును గవర్నర్ తిరస్కరించారు. ఈ అంశంపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.
కేవలం సాంకేతిక కారణాల ఆధారంగా పిటిషన్‌లను తేల్చలేమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పిటిషన్ల విచారణార్హతతోపాటు గవర్నరు నిర్ణయంపై న్యాయసమీక్ష పరిధిపైనా విచారణ చేపడతామంది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ… మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనన్నారు. అధికరణ 361 ప్రకారం పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరాలున్నాయని గవర్నరు కారద్యర్శి తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టులో కేసు విషయాన్ని గవర్నరు పరిగణనలోకి తీసుకున్నారని ఈ విషయం తేలేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది.