తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు.
వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు సంపూర్ణమైన విశ్వాసం కల్పించడానికే ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మరో పక్షం రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.