గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దరఖాస్తు గడువు అయిపోయిందని ఆశావహులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌కు దరఖాస్తులు పంపించవచ్చని తెలిపారు. గ్రామకంఠంలోని పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని.. ఇంటి నంబర్ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇళ్లు పూర్తైన తర్వాత రెండో దశలో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తామన్నారు.
అయితే గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు పలు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అవేంటంటే.. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఇంటి స్థలం దస్తావేజులు, సహా ఇతరపత్రాలను జత చేయాలి. ఈ నెల పదో తేదీ వరకు మీసేవ ద్వారా సదరు కార్యాలయాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.