సొంత స్థలం ఉండి, ఇప్పటివరకు ఆర్‌సీసీ స్లాబ్ ఇల్లు లేని పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి పెద్దఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తొలిదశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని సర్కారు నిర్ణయించింది. మండల స్థాయి నుంచి మున్సిపాలిటీల వారీగా దరఖాస్తులు వేరు చేసి పరిశీలించాలని నిర్ణయించారు.
దరఖాస్తుదారుకు ఆర్‌సీసీ పైకప్పుతో కూడిన ఇల్లు ఉండకూడదు. జీవో నంబరు 59 కింద లబ్ధి పొందకూడదు. ఆహార భద్రత కార్డు ఉండాలి.. ఇలా పలు అర్హత నిబంధనలను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 25వ తేదీ నుంచి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయానున్నట్లు తెలిపింది. ఎమ్మెల్యేల ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.