తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం పెద్ద హనుమాన్ జయంతికి ముస్తాబైంది. ఇవాళ్టి నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దీక్ష విరమణ కోసం ఇప్పటికే భారీగా హనుమాన్ మాలధారులు తరలివస్తున్నారు. అంజన్న సన్నిధిలో మాలదారులు దీక్ష విరమణ చేసి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలవ పందిళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
మరోవైపు భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అంజన్న ఆలయానికి వచ్చే వారి కోసం 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి చేరేందుకు 4 ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు, వాహన పూజలు రద్దు చేశారు. దీక్షా విరమణ కోసం 300 మంది అర్చకులు ఏర్పాటు చేసినట్లు ఈవో చంద్ర శేఖర్ తెలిపారు.