కూతురికి ప్రేమపేరుతో వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో మనోవేదనకు గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గద్వాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న చోటుచేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కథనం ప్రకారం.. గద్వాలకు చెందిన 34 ఏళ్ల ఓ తండ్రి కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అతనికి 16 ఏళ్ల కూతురు ఉన్నది. స్థానిక స్కూల్‌లో చదువుకుంటోంది. గద్వాలకు చెందిన వినోద్ అనే యువకుడు ఆమెను ప్రేమపేరుతో గత కొన్నాళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో కూతురిని ఆ తండ్రి చదువు మానిపించారు.తన కూతురి వెంట పడొద్దని వినోద్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతని తీరు మారలేదు. వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో యువతి తండ్రి తీవ్ర మనోవేదనకు గురై వెంకంపేట శివారులో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.