తెలంగాణ రాక ముందు మనకు 5 వైద్య కళాశాలలే ఉండేవని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తమ ఒత్తిడి వల్లే 2008లో రిమ్స్, 2013లో నిజామాబాద్ వైద్య కళాశాల వచ్చాయని తెలిపారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 29 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
‘దేశం మొత్తం వైద్యులను సరఫరా చేసే స్థాయికి చేరాం. కోర్టు నుంచి అనుమతి వచ్చాక అధునాతన ఉస్మానియా ఆస్పత్రి కడతాం. కొత్తగా వైద్య కళాశాలల్లో చేరేవారికి ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధించాం. ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాం. వైద్య రంగంలో ఎన్నడూ లేని విధంగా నోటిఫికేషన్లు ఇచ్చి.. సిబ్బందిని భర్తీ చేస్తున్నాం. రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నాం. నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం.’ అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు.