తెలంగాణ గొంతుక మూగబోయిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రముఖ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మరణించారు. బుధవారం కుటుంబంతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలో ఉన్న అతని ఫామ్ హౌస్ కు వెళ్లారు. రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే.. సాయిచంద్ మృతిపై హరీష్ రావు స్పందించారు. నాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని ఉర్రూతలూగించి, నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ప్రజలకు పాట రూపంలో చెబుతున్న గొంతుక మూగబోయిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం అని ఎమోషనల్ అయ్యారు హరీష్ రావు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారు. జోహార్ సాయిచంద్ అంటూ పోస్ట్‌చేశారు.