పోటీ పరీక్షల వాయిదాపై మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలు పరిణితి లేనివని అన్నారు. రేవంత్ రెడ్డి గతం మరిచిపోయినట్లు ఉన్నారని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-2, టెట్ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రేవంత్ ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించట్లేదని హరీశ్ రావు నిలదీశారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట అధికారంలోకి వచ్చాక మరొక మాట మాట్లాడతారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఊసరవెల్లి సైతం రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలు, జీవితాలతో రాజకీయం చేసి ..అధికారంలోకి వచ్చాక డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, రెండు నాల్కల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని తప్పక బుద్ధి చెబుతారని హరీష్ రావు పేర్కొన్నారు.