హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూములను పరిరక్షించడం కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ల భవనాలను నాదం చెరువు బఫర్ జోన్‌లో నిర్మించారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా వాటిపై చర్యలకు ఉపక్రమించబోతుందని సమాచారం. దీనిపై తాజాగా బీఆర్ఎస్ నేతలు స్పందించారు.
మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేక పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 36 శాతం డెంగ్యూ కేసులు పెరిగాయని.. డెంగ్యూ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని.. ప్రజల ఆరోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉందా? అని నిలదీశారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా మారిందని.. రాష్ట్రంలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ పరిస్థితి ఉందని.. అది పట్టించుకోకుండా రాజకీయ బుల్లింగ్కు ప్రభుత్వం పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. డెంగ్యూపై సమీక్ష చేయకుండా.. విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.