తాను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా అని తెలంగాణ మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. పల్లెలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డీపీవోలదే అన్నారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికల రూపొందించుకుని, ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోయినా, ఒత్తిడి తట్టుకుని పని చేసిన డీపీవోలకు ఈ సందర్భంగా అభినందనలు చెప్పారు.
గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకే దక్కిందని అన్నారు. అందుకే ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా ఉండాలని కోరారు. మానవతాన్ని జోడించి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. తప్పులను సరిదిద్దుకుని విధుల్లో వేగం పెంచాలని పిలుపునిచ్చారు. తాను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులుగా మీ సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు.