తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు అందించారు. ఇవాళ (సోమవారం) రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు మంగళవారం ఈ జిల్లాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు ఆదివారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాప్రాలలో 4.5 సెం.మీటర్లు కురిసిందని తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని.. శనివారం దక్షిణ ఆంధ్రప్రదేశ్ సమీపంలో బంగాళాఖాతం తీరంలో ఏర్పడిన ఆవర్తనం అక్కడే కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.