తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, సంక్షేమ గురుకులాల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటనలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రతి నెలలో ఒకరోజు విద్యార్థుల హాస్టల్స్ లో పర్యటిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈ నెల నుండే హాస్టల్స్ లో పర్యటించి, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు హాస్టల్లలో వసతులను మెరుగుపరిచేందుకు రూ. 5 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. హాస్టల్స్ ప్రత్యేక అధికారులు రోజు లేదా రెండు రోజులకు ఒకసారి గురుకులాలు, వసతి గృహాల్లో ఆహార వస్తువుల నిల్వ, వంటపై తనిఖీ చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఎవరైనా ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక అటు అసెంబ్లీలో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చకుండా ఉండేలా చూస్తామని చెప్పుకొచ్చారు.