దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల అధికారులు మొదటి దశ పోలింగ్ కు ఏర్పాట్లు చేయడంలో బిజీ అయ్యారు. ఇంకోవైపు అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు, ప్రత్యేక బృందాలు విస్త్రృత తనిఖీలు చేపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.71.73 కోట్ల మేర నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ఏజెన్సీలు చేపట్టిన తనిఖీల్లో రూ. 29.30 కోట్ల నగదు, రూ.9.54 కోట్ల విలువైన మద్యం, రూ. 15.34 కోట్లు విలువ చేసే డ్రగ్స్, రూ. 10.33 కోట్ల విలువైన నగలు, రూ.7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనల మేరకు సరైన ఆధారాలు లేని నగదు, మద్యం, ఇతర విలువైన సొమ్మును సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.