తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాజకీయ నేతల నుంచి సామాన్యుల వరకూ అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి రవాణా చేస్తున్న నగదు, బంగారం, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు 571 కోట్లకుపైగా సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు 571 కోట్ల 80 లక్షలకు పైగా నగదు, ఆభరణాలు, మద్యం, ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. గడచిన 24 గంటల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 12 కోట్ల 88 లక్షలకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 198 కోట్ల 30 లక్షలకు పైగా నగదు… 178 కోట్ల 81 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 85 కోట్ల 75 లక్షలకు పైగా విలువైన మద్యం… 32 కోట్ల 43 లక్షలకు పైగా విలువైన డ్రగ్స్ పట్టుబడినట్లు చెప్పారు. 76 కోట్ల 49 లక్షలకు పైగా విలువైన బియ్యం, కుక్కర్లు, చీరలు, సహా ఇతరత్రా కానుకలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.