రాష్ట్రంలో ఓవైపు పగలంతా ఎండ భగ్గుమంటుంటే.. రాత్రి మాత్రం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం రాత్రి రాష్ట్రంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో వర్షం పడగా కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని సోమారంపేట్, రత్నగిరి పల్లి, నెమలిగుట్ట తాండా, బంజేపల్లి గ్రామాలలో కురిసిన వడగళ్ల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలపాలు కాగా.. పలు గ్రామాల్లో ఇంటిపై కప్పులు, రేకులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అకాల వర్షాలు కురవడంతో రైతులలో ఆందోళన నెలకొంది. వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.