హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే మెట్రోలో ఫాస్ట్ గా గమ్యస్థానానికి చేరుకుందామనుకుంటున్న నగర వాసులకు టికెట్ తీసుకోవడానికి కౌంటర్ వద్ద క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి. దీనికీ ఓ సూపర్ పరిష్కారం కనిపెట్టింది హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ. అదేంటంటే..?
మెట్రోరైల్ ప్రయాణికులు ఇకపై వాట్సాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. మెట్రోరైల్ కౌంటర్లలో టిక్కెట్లు కొనేందుకు వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదని వివరించారు. వాట్సాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నగదు బదిలీ చేయవచ్చని, దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం బిల్‌ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు.
మెట్రోస్టేషన్ల వద్ద ఉన్న క్యూర్ కోడ్‌ను వాట్సాప్ ద్వారా స్కాన్ చేసి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయొచ్చనిఅధికారులు తెలిపారు.
మెట్రోలో వాట్సాప్ ద్వారా టికెట్ కొనుగోలు ఎలా చేయాలంటే..
- మీ నంబర్‌తో 8341146468కు హాయ్ చెప్పండి
- ఓటీపీ ఎంటర్ చేయాలి
- గమ్యస్థానాన్ని నమోదు చేయాలి
- టిక్కెట్ ధరను బదిలీ చేయాలి
- ఈ-టికెట్ వస్తుంది