ప్రజల భద్రతకు ఒక నోడల్ ఏజెన్సీ అవసరం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఎలక్ట్రికల్ సేప్టీ ఇన్ బిల్డింగ్స్ అనే అంశం పై శనివారం హైడ్రా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యాత ఇవ్వాలని సూచించారు. ప్రమాదాల నివారణకు విద్యుత్, ఫైర్, ఇండస్ట్రీ ఇలా ఎవ్వరికీ వారు కాకుండా ఇందుకు ఉద్దేశించిన వ్యవస్థలన్నీ ఒక ప్లాట్ ఫామ్ పైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యుత్ వినియోగంలో ఉన్న లోపాల వల్లనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అందరిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో లేదో పరిశీలించడానికి సంబంధిత విభాగాలకు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడల్ ఏజెన్సీ ని రూపొందించాలని హైడ్రా కమిషనర్ అభిప్రాయపడ్డారు.