తెలంగాణలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఏర్పాట్లు మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రారంభించింది.
తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 80 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు 4,40,371 మంది ఉన్నట్లు వెల్లడించారు. వారిలో 1,89,519 మంది పురుషులు, 2,50,840 మంది మహిళలు, 12 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
18-19 ఏళ్ల నవతరం ఓటర్లు 9,99,667 మంది ఉండగా.. వీరిలో 5,70,274 మంది యువకులు, 4,29,273 మంది యువతులు, 120 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 5,06,921 మంది దివ్యాంగ ఓటర్లలో 2,90,090 మంది పురుషులు, 2,16,815 మంది మహిళలు, 16 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు వెల్లడించారు.